Red Sanders Smuggler: ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో కీలక తీర్పు వెలువడింది. ఎర్రచందనం స్మగ్లరుకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 6 లక్షల జరిమానా విధిస్తూ ఆర్ఎస్ఎఎస్‌టీఎఫ్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు ఇచ్చారు.
ఈ కేసు విచారణకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ఎఎస్టీఎఫ్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు రూపొందించిన కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఏఎస్పీ జె. కులశేఖర్ పర్యవేక్షణలో పలు పెండింగ్ కేసులపై దృష్టి పెట్టారు.
also read:Parakamani Case | వైవీ సుబ్బారెడ్డి సీఐడీ విచారణకు హాజరు
ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అలుగూరి అమర నారాయణ ఆధ్వర్యంలో సాక్ష్యాలను బలంగా సమర్పించడం ద్వారా న్యాయపరమైన ప్రక్రియను వేగవంతం చేశారు. దీంతో 2019లో నమోదైన క్రైమ్ నంబర్ 22/2019 కేసులో అరెస్టైన తమిళనాడు విల్లుపురం జిల్లా చెందిన ముట్టియన్ ఆండీ నేరం రుజువైంది.
అతను తిరుపతి జిల్లా నాగపట్ల ఈస్ట్ బీట్, చామల రేంజ్ పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. న్యాయస్థానం శిక్ష విధించిన అనంతరం, కోర్టు ఆదేశాల మేరకు అతన్ని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.
శేషాచలం రిజర్వు అటవీలోని విలువైన ఎర్రచందనం చెట్లను నరికి అక్రమ రవాణా చేసే వారికి ఇది ముఖ్యమైన హెచ్చరికగా పరిగణించాలని టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ పేర్కొన్నారు. ముద్దాయిలకు శిక్షలు పడేందుకు సహకరిస్తున్న కోర్టు సిబ్బందిని ఆయన అభినందించారు.
