భూటాన్ పర్యటన ముగించుకుని నేడు దేశానికి తిరిగి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM MODI), ఢిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా లోక్‌నాయక్(Lok Nayak Hospital) జై ప్రకాష్ నారాయణ్ ఆసుపత్రికి వెళ్లారు. ఎర్రకోట(Red Fort blast victims) సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడులో గాయపడిన బాధితులను పరామర్శించారు.
వారితో మాట్లాడి ధైర్యం చెబుతూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వైద్యుల నుండి చికిత్స వివరాలు, బాధితుల పరిస్థితిపై పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నారు.
భూటాన్ పర్యటనలో ఉండగానే మోదీ ఈ పేలుడు ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసి, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. “ఈ ఘటన దేశాన్ని కలచివేసింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. నేరస్థులు తప్పించుకోలేరు” అని థింఫు నుంచి ప్రకటించారు.
ఇక దర్యాప్తు వేగవంతం చేయడానికి ఎన్ఐఏ ప్రత్యేక బృందం ఏర్పాటు చేసింది. ఏడీజీ విజయ్ సఖారే నేతృత్వంలోని ఈ బృందంలో ఐజీ, డీఐజీలు, ఎస్పీలు, డీఎస్పీలు ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా పరిస్థితిని సమీక్షించి, నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని ఆదేశించారు.
దర్యాప్తు సంస్థలు ఇది ఆత్మాహుతి దాడి అయి ఉండవచ్చని అనుమానిస్తున్నాయి. వెయ్యికి పైగా సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తుండగా, సోషల్ మీడియా కార్యకలాపాలను కూడా పర్యవేక్షిస్తున్నారు.
దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, ముంబై నగరాల్లో హై అలర్ట్ ప్రకటించి భద్రతను బలోపేతం చేశారు.
ALSO READ:Telangana Scholarships:PDSU విద్యార్థుల నిరసన ర్యాలీ
