మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’(Ravi Teja Irumudi )పై ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పట్ల అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది.
ఈ సినిమాలో ఒకప్పటి ఐకానిక్ భక్తి గీతం “విల్లాల వీరుడు.. వీరమణికంఠుడు.. ఎక్కినాడు బంగారు పల్లకి” పాటను రీమిక్స్ చేయనున్నట్లు సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ అధికారికంగా తెలిపారు. రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ క్లాసిక్ సాంగ్‌ను కొత్త ఎనర్జీతో రీమిక్స్ చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది.
అయ్యప్ప భక్తుల మనసుల్లో ప్రత్యేక స్థానం ఉన్న ఈ పాటను ఆధునిక శైలిలో మలచాలని ఫ్యాన్స్ నుంచి వచ్చిన భారీ డిమాండ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రవితేజ ఎనర్జీకి ఈ ఐకానిక్ ట్రాక్ తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.
ఈ చిత్రం కేవలం భక్తి నేపథ్యంతోనే కాకుండా బలమైన తండ్రి–కూతురు భావోద్వేగ కథతో కూడా రూపొందుతోంది. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర కీలక పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను ఈ ఏడాది చివరలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రవితేజ ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వస్తాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.








