టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఎస్ఎస్ఎంబీ 29’ సినిమా ఇటీవల ఒడిశాలో షూటింగ్ జరుపుకుంది. ఈ నేపథ్యంలో రాజమౌళి ఒడిశాలోని అత్యంత ఎత్తైన శిఖరం దేవ్‌మాలి పర్వతంపై ట్రెక్కింగ్ చేశారు. ఈ అనుభవాన్ని తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో పంచుకున్నారు. దేవ్‌మాలి శిఖరం పైనుండి కనిపించే దృశ్యాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని రాజమౌళి పేర్కొన్నారు.
అయితే, ట్రెక్కింగ్ సమయంలో తనను ఒక విషయం తీవ్రంగా కలచివేసిందని రాజమౌళి తెలిపారు. ఆ ప్రదేశంలో అపరిశుభ్రత ఎక్కువగా ఉందని, సందర్శకులు వాడిన వస్తువులను అక్కడే పడేయడం దారుణంగా అనిపించిందని అభిప్రాయపడ్డారు. దేవ్‌మాలి లాంటి అందమైన ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచడం మన బాధ్యత అని రాజమౌళి వ్యాఖ్యానించారు.
ట్రెక్కింగ్‌కు వెళ్లే వారంతా తమ వద్ద ఉన్న ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర వ్యర్థాలను అక్కడే వదిలేయకుండా తీసుకెళ్లాలని సూచించారు. ప్రకృతి అందాలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని పంచుకుంటున్నానని తెలిపారు. ట్రెక్కింగ్ అనుభవం ఎంత అపూర్వమైనదో, అలాగే ప్రకృతిని రక్షించడం మన బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
రాజమౌళి పర్యావరణ పరిరక్షణపై చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. అభిమానులు, పర్యావరణ ప్రేమికులు ఆయన అభిప్రాయాన్ని సమర్థిస్తున్నారు. ప్రకృతి పరిరక్షణపై మరింత అవగాహన పెంచడానికి రాజమౌళి చేసిన ఈ ట్వీట్ ప్రేరణగా నిలుస్తుందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.