ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ 272 మంది ప్రముఖులు ఆయనకు ఓపెన్ లేఖ రాశారు. ప్రజాస్వామ్యం, దాని పునాదులపై దాడి జరుగుతోందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని వారు పేర్కొన్నారు.
ఓట్ల చోరీ జరుగుతోందని కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆయన విధానాలను విమర్శిస్తూ ఈ లేఖపై 16 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు, 123 మంది మాజీ అధికారులు, 133 మంది రిటైర్డ్ సైనికాధికారులు, 14 మంది మాజీ రాయబారులు సంతకం చేశారు.
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ ఆధారాలు లేకుండా ఆరోపించారని, ఇది ప్రజాస్వామ్య సంస్థలను లక్ష్యంగా చేసుకున్న చర్య అని వారు విమర్శించారు.
ALSO READ:Sachin Tendulkar | సత్యసాయి నాకు ఫోన్ చేసి పుస్తకం పంపించారు
ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించడం సరికాదని, ఈసీ ప్రతి స్థాయిని విలన్‌లా చూపించడం ప్రజా నమ్మకాన్ని దెబ్బతీస్తుందని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను తప్పుదోవ పట్టించే విధంగా విమర్శించడం అప్రజాస్వామికమని లేఖలో పేర్కొన్నారు.
ఈసీ ఇప్పటికే SIRపై స్పష్టత ఇచ్చిందని, సుప్రీం కోర్టు మార్గదర్శకాలు కూడా అమలులో ఉన్నాయని గుర్తు చేశారు. ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వస్తే ఆరోపణలు మానుకుని, ప్రతికూలం వస్తే ఈసీపై నేరుగా దాడులు చేయడం అనైతికమని వారు అన్నారు.
