PM Modi: పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో ఆడబిడ్డలకు భద్రత లభిస్తుందని ఆయన అన్నారు. పూర్బ బర్ధమాన్, ముర్షిదాబాద్ ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సభల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
బీజేపీ సంకల్పం కేవలం ఎన్నికల హామీ కాదని, అది టీఎంసీ పాలనలోని “జంగిల్ రాజ్”, “సిండికేట్ రాజ్”కు ముగింపు అని మోడీ వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో అవినీతి, హింస, అశాంతి పెరిగిపోయాయని ఆరోపిస్తూ, బీజేపీ అధికారంలోకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహిళలకు నెలకు రూ.3,000 ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
అవినీతి, శాంతిభద్రతలపై ప్రత్యేక శ్వేతపత్రం విడుదల చేస్తామని, ప్రతి టీఎంసీ నేత, సిండికేట్, అవినీతి నాయకులను చట్టం ముందు నిలబెడతామని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ హింసపై విచారణ కోసం విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఇక కేరళ రాజకీయాలపై కూడా వ్యాఖ్యానిస్తూ, అక్కడ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ పార్టీలు కూడా తమ విజయంపై నమ్మకం లేకుండా ఉన్నాయని, ఓటమిని ముందుగానే అంగీకరించిన పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ బలం పెరుగుతోందని మోడీ అభిప్రాయపడ్డారు.








