ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రమాద సమయంలో మార్క్ చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయి. ముఖ్యంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటనపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్.కె. రోజా తన మనసులోని భావాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. “ఈ రోజు పవన్ కల్యాణ్ గారి చిన్నబాబు మార్క్ శంకర్ ప్రమాద వార్త నా మనసును ఎంతో కలచివేసింది” అంటూ మొదలుపెట్టిన ఆమె పోస్ట్ అందరినీ కదిలించింది.
“ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని, దీర్ఘాయుష్షుతో ఆరోగ్యవంతుడిగా తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా జీవించాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను” అని రోజా పేర్కొన్నారు. రాజకీయ విభేదాలు పక్కనపెట్టి ఆమె చేసిన ఈ పోస్ట్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది.
ప్రస్తుతం ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాల్లో పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్, ఈ సంఘటన తెలుసుకున్న వెంటనే తన కార్యాచరణను తాత్కాలికంగా నిలిపివేసి ఈ సాయంత్రం సింగపూర్‌కి బయలుదేరనున్నారు. కుటుంబ సభ్యులు ఇప్పటికే మార్క్ పక్కన ఉండేందుకు ఆసుపత్రికి చేరుకున్నారు.