Pawan Kalyan: విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో రైతులను ఇబ్బంది పెడుతున్న అడవి ఏనుగుల గుంపును నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పలమనేరు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు తరలిస్తున్న కుంకీ ఏనుగులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం వద్ద ప్రత్యేకంగా స్వాగతం పలికారు. కుంకీ ఏనుగులు(Kumki Elephants) జయంత్, అభిమన్యులకు పూలమాలలు వేసి, చెరుకు గెడలను ఆహారంగా అందించారు. అనంతరం వాటి తరలింపు ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ రెండు కుంకీలను పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపుకు తరలించనున్నారు. అక్కడి నుంచి అడవి ఏనుగులు ఎక్కువగా సంచరించే ప్రాంతాలకు తీసుకెళ్లి, వాటి కదలికలను నియంత్రించే కార్యక్రమంలో అటవీశాఖ వినియోగించనుంది. పంటలను రక్షించడంతో పాటు గ్రామాల్లోకి అడవి ఏనుగులు రాకుండా చర్యలు తీసుకోవడంలో కుంకీ ఏనుగులు కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు భావిస్తున్నారు.








