AP Cabinet Meeting: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికలు, ప్రజా సంక్షేమ చర్యలు, ఉద్యోగ అవకాశాలపై మంత్రులు కీలక నిర్ణయాల దిశగా చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా నిరుద్యోగులకు ప్రయోజనం కలిగించే అంశంగా రెండో దశలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రతిపాదనపై కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
చేనేత రంగానికి అండగా నిలిచేందుకు రూపొందించిన ‘నేతన్న భరోసా’ పథకంపైనా సమావేశంలో చర్చ జరుగుతోంది. అర్హత ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మొత్తం 25కు పైగా అంశాలతో కూడిన అజెండాపై సీఎం, మంత్రులు సమీక్షిస్తున్నారు. ఇక బాపట్ల జిల్లా వెదుళ్లపల్లిలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు ప్రతిపాదనను కూడా కేబినెట్ పరిశీలించనుంది.
అలాగే శ్రీకాకుళంలో బ్రహ్మకుమారీస్ సంస్థకు కేటాయించిన స్థలం లీజు కొనసాగింపు, 15వ ఆర్థిక సంఘం నిధులతో అగ్నిమాపక శాఖకు కొత్త వాహనాలు, ఆధునిక పరికరాల కొనుగోలు వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి. సమావేశం పూర్తైన తర్వాత కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది. ఉద్యోగ నియామకాలు, చేనేత సంక్షేమంపై వెలువడే నిర్ణయాలపై రాష్ట్ర ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
ALSO READ: Jammu Kashmir | కాల్పులకు కౌంటర్ యాక్షన్.. ఉగ్రవాదుల ఇళ్లను నేలమట్టం చేసిన అధికారులు








