Saturday, August 1, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshPawan Kalyan | బాలుడి చివరి కోరిక తీర్చిన పవన్ కల్యాణ్.. హన్మకొండలో భావోద్వేగ క్షణాలు

Pawan Kalyan | బాలుడి చివరి కోరిక తీర్చిన పవన్ కల్యాణ్.. హన్మకొండలో భావోద్వేగ క్షణాలు

-

Chat on WhatsApp

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హన్మకొండ పర్యటనలో భావోద్వేగ క్షణాలు చోటుచేసుకున్నాయి. స్థానిక హనుమాన్ నగర్‌కు చెందిన నిరంజన్ అనే బాలుడు తీవ్ర నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతూ, తన అభిమాన నటుడు పవన్ కల్యాణ్‌ను ఒక్కసారి కలవాలనే కోరికను వ్యక్తం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ స్వయంగా బాలుడి ఇంటికి వెళ్లి అతడిని పరామర్శించారు.

సుమారు 15 ఏళ్ల వయస్సు ఉన్న నిరంజన్ చాలా కాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. వ్యాధి ప్రభావంతో అతని కాళ్లు పనిచేయడం లేదు. శారీరకంగా ఎదుగుదల కూడా ప్రభావితమవడంతో అతడు చిన్న బాలుడిలా కనిపిస్తున్నాడు. జీవితంలో ఒక్కసారి అయినా పవన్ కల్యాణ్‌ను కలవాలని, ఆయన సినిమాల్లోని డైలాగ్‌ను స్వయంగా చెప్పాలని నిరంజన్ కోరుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

బాలుడి కోరిక గురించి తెలుసుకున్న పవన్ కల్యాణ్ అతని ఇంటికి చేరుకుని ఆప్యాయంగా పలకరించారు. నిరంజన్ ఆరోగ్య పరిస్థితి గురించి తల్లిదండ్రులను అడిగి తెలుసుకోవడంతో పాటు, ప్రస్తుతం అందుతున్న చికిత్స వివరాలను కూడా తెలుసుకున్నారు. పవన్‌ను దగ్గరగా చూసిన నిరంజన్, కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ హన్మకొండలోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన జనసైనికుల సమావేశం, భోజన కార్యక్రమంలో పాల్గొని విజయవాడకు బయలుదేరనున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జనసేన సభకు అనుమతి లభించని నేపథ్యంలో, తెలంగాణలో పవన్ కల్యాణ్ చేపట్టిన తొలి పర్యటన కావడంతో ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో హన్మకొండకు తరలివచ్చారు. పవన్ రాకతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp