ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరకు అభివృద్ధికి శ్రమించేందుకు కసిగా రంగంలోకి దిగారు. అల్లూరి జిల్లాలోని డుంబ్రిగుడలో ‘అడవితల్లి బాట’ కార్యక్రమాన్ని పవన్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “అడవి తల్లి అన్నం పెడుతుంది, నీడనిస్తుంది. మన్యం పరిరక్షణతోపాటు అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి” అని అన్నారు.
అరకు ప్రాంతం ప్రకృతితో నిండి, పర్యాటక అభివృద్ధికి అనువుగా ఉందని పవన్ పేర్కొన్నారు. మన్యం ప్రాంతాల్లో రహదారి సౌకర్యం లోపించడం వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ఇందుకు పరిష్కారం చూపడం అవసరమన్నారు. గిరిజనుల జీవనశైలిని మెరుగుపరచేందుకు అనేక కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.
రహదారి నిర్మాణానికి రూ.49 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు సీఎం చంద్రబాబుకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వంతో పోలిస్తే, కూటమి ప్రభుత్వం ఒకే ఏడాదిలో రూ.1,500 కోట్ల విలువైన పనులకు ఆమోదం తెలిపిందని వివరించారు. త్వరలోనే ఈ పనులు ప్రారంభమవుతాయని ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ తన పర్యటనలో భాగంగా పెదపాడు గ్రామాన్ని సందర్శించి గిరిజనులతో సమావేశమయ్యారు. వారి సమస్యలు తెలుసుకొని, అవసరమైన పరిష్కారాలను ఆరు నెలల కాలంలో అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల అభివృద్ధి కోసం అధికారంలో ఉన్నామంటూ ఆయన భరోసా కల్పించారు.