Oracle Layoffs: అమెరికా టెక్ దిగ్గజం “ఒరాకిల్“(Oracle) ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో “లేఆఫ్స్”(Layoffs) చేపట్టినట్లు సమాచారం. కంపెనీలో పనిచేస్తున్న సుమారు 1.62 లక్షల మంది ఉద్యోగుల్లో 18 శాతం , అంటే దాదాపు 30,000 మందిని తొలగించినట్లు వార్తలు వెలువడ్డాయి. వీరిలో సుమారు 12,000 మంది భారతీయ ఉద్యోగులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
నిన్న ఉదయం వేలాది మంది ఉద్యోగులకు ఒకేసారి లేఆఫ్ మెయిల్స్ పంపినట్లు తెలుస్తోంది. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొన్ని రోల్స్ అవసరం లేదని చెబుతూ ఉద్యోగాల కోత విధించింది.
తొలగింపులకు గురైన వారికి మార్చి 31నే చివరి పనిదినంగా ప్రకటించడంతో పాటు, కంపెనీ ల్యాప్‌టాప్‌లు, సిస్టమ్ యాక్సెస్‌ను వెంటనే నిలిపివేయడం ఉద్యోగులను షాక్‌కు గురి చేసింది. భారత్‌లో ఒరాకిల్‌కు పెద్ద ఎత్తున ఉద్యోగులు ఉండటంతో ఈ ప్రభావం మరింత తీవ్రంగా కనిపిస్తోంది.
ముఖ్యంగా మేనేజీరియల్ స్థాయి ఉద్యోగులే ఎక్కువగా టార్గెట్ అయ్యారని సమాచారం. ఇదే చివరి విడత కాదని, ఇంకా మరిన్ని లేఆఫ్స్ ఉండొచ్చన్న వార్తలు ఉద్యోగుల్లో టెన్షన్ పెంచుతున్నాయి.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఒరాకిల్ ప్రస్తుతం నష్టాల్లో లేదు. ఇటీవల ముగిసిన త్రైమాసికంలో కంపెనీ లాభాలు “95 శాతం పెరిగి 6.13 బిలియన్ డాలర్లకు” చేరాయి.
అయితే, ప్రస్తుతం కంపెనీ “AI డేటా సెంటర్ రంగంలో భారీ పెట్టుబడులు” పెడుతోంది. సుమారు 156 బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే 50 బిలియన్ డాలర్ల అప్పు తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఖర్చులను తగ్గించేందుకు ఉద్యోగాల కోతలు అమలు చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
తొలగించిన ఉద్యోగులకు మూడు నెలల జీతం, ప్రతి ఏడాదికి 15 రోజుల జీతం, మిగిలిన సెలవుల ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలు ప్రకటించినట్లు తెలుస్తోంది.








