Narendra Modi Norway Visit: భారత విదేశాంగ చరిత్రలో మరో కీలక ఘట్టం నమోదైంది. నరేంద్ర మోడీ నార్డిక్ దేశాల పర్యటనలో భాగంగా ఒస్లో(Oslo) చేరుకున్నారు. గత 43 ఏళ్ల తర్వాత నార్వేను సందర్శించిన తొలి భారత ప్రధానిగా మోడీ చరిత్ర సృష్టించారు. ఈ పర్యటన భారతదేశం ఉత్తర ఐరోపా దేశాలతో వ్యూహాత్మక, ఆర్థిక, దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో కీలకంగా మారనుంది.
ఒస్లోలోని గార్డెర్మోయెన్ విమానాశ్రయంలో జోనాస్ గహర్ స్టోర్ (Jonas Gahr Store) స్వయంగా ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు. ఇటీవల భారత్ మరియు European Free Trade Association (EFTA) మధ్య కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం నేపథ్యంలో ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యం సంచరించుకుంది.
మంగళవారం జరగనున్న మూడవ భారత్-నార్డిక్ సదస్సులో మోడీ పాల్గొననున్నారు. ఈ సమావేశం ద్వారా నార్డిక్ దేశాలతో ఆర్థిక, సాంకేతిక, వాణిజ్య సంబంధాలు మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నార్వే చేరుకున్న అనంతరం ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. “43 ఏళ్ల తర్వాత నార్వేను సందర్శిస్తున్న తొలి భారత ప్రధాని కావడం గర్వంగా ఉంది.
ఈ పర్యటన భారత్-నార్వే స్నేహాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తుందని నమ్ముతున్నాను” అని పేర్కొన్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన హెరాల్డ్ వీ, మహారాణి సోంజాలను కూడా కలుసుకోనున్నారు.
నార్వే పర్యటనకు ముందు మోడీ స్వీడన్‌లో పర్యటించారు. అక్కడ భారత్-స్వీడన్ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఉన్నతీకరించడంతో పాటు, జాయింట్ ఇన్నోవేషన్ పార్ట్‌నర్‌షిప్ 2.0, ఇండియా-స్వీడన్ టెక్నాలజీ & AI కారిడార్‌ను ప్రారంభించారు. రాబోయే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో చర్చలు జరిగినట్లు తెలిపారు.
ఇక ఒస్లోలో భారతీయ ప్రవాసులు ప్రధాని మోడీకి అపూర్వ స్వాగతం పలికారు. “ఆయన మాకు రాక్‌స్టార్ కంటే ఎక్కువ” అంటూ అక్కడి భారతీయులు భావోద్వేగంగా స్పందించారు. EFTA ఒప్పందం తర్వాత నార్వే పరిశ్రమలు భారత్‌తో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు.
మొత్తంగా ఈ పర్యటన ఉత్తర ఐరోపాలో భారత ప్రభావాన్ని మరింత బలోపేతం చేసే కీలక అడుగుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ALSO READ:విద్యార్థులకు గుడ్ న్యూస్…AP LAWCET 2026 Results Out








