ఆంధ్రప్రదేశ్ 2025-26 బడ్జెట్‌ను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రశంసించారు. రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపకల్పన చేసిన ఈ బడ్జెట్ రాష్ట్రాభివృద్ధికి కీలకంగా మారుతుందని అన్నారు. సోమవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. పేదల బలోపేతం, సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద పీట వేశారని, స్వర్ణాంధ్ర – విజన్ 2047ను సాధించేందుకు ఈ బడ్జెట్ దోహదపడుతుందని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ అసమర్థత వల్ల ఆర్థికంగా కుదేలైన రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టేలా ఈ బడ్జెట్ రూపొందించారని తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సహకారానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. విద్య, వైద్యం, వ్యవసాయం, రహదారులు, ఐటీ, పంచాయతీరాజ్, మహిళా సంక్షేమం వంటి రంగాలకు భారీ కేటాయింపులు చేయడం అభివృద్ధికి మార్గం వేస్తుందని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టం చేశారు.
మహిళా సంక్షేమానికి బడ్జెట్‌లో పెద్ద పీట వేశారని, దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడంతో పాటు తల్లికి వందనం పథకానికి రూ.9,407 కోట్లు కేటాయించారని అన్నారు. అంగన్వాడీల గ్రాట్యుటీ చెల్లింపులకు రూ.60 కోట్లు, నిర్వహణకు రూ.878 కోట్లు కేటాయించడం సంతోషకరమని అన్నారు. మహిళా శిశు సంక్షేమానికి రూ.4,332 కోట్లు కేటాయించడం గర్వించదగిన విషయమని తెలిపారు.
నెల్లూరు జిల్లాకు పెద్దఎత్తున నిధులు కేటాయించారని తెలిపారు. తెలుగు గంగ ప్రాజెక్ట్‌కు రూ.345 కోట్లు, సోమశిల జలాశయానికి రూ.266 కోట్లు, విక్రమ సింహపురి యూనివర్సిటీకి రూ.20.53 కోట్లు మంజూరు చేశారని పేర్కొన్నారు. రామాయపట్నం పోర్ట్‌కు రూ.100 కోట్లు, అన్నదాత సుఖీభవ పథకంలో 1.77 లక్షల మంది రైతులకు రూ.247 కోట్లు కేటాయించారని తెలిపారు. రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తూ, సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో ప్రజాసేవ కొనసాగిస్తానని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పష్టం చేశారు.