ఏపీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ భార్య షహనాజ్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలిసిన వెంటనే కుటుంబానికి పలువురు రాజకీయ నాయకులు సానుభూతి తెలియజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మంత్రి ఫరూఖ్ భార్య మరణించడం కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని, మంత్రి ఫరూఖ్ దైర్యంగా ఉండాలని సూచించారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా షహనాజ్ మరణంపై సంతాపం తెలిపారు. జీవిత భాగస్వామిని కోల్పోవడం ఎంతో బాధాకరమని, మంత్రి ఫరూఖ్ గారు ఈ కష్టాన్ని అధిగమించే శక్తిని పొందాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మంత్రి నారా లోకేశ్ కూడా షహనాజ్ మృతికి విచారం వ్యక్తం చేశారు. పవిత్ర రంజాన్ మాసంలో ఆమె మరణించడం బాధాకరమని, ఆమెకు జన్నత్‌లో ఉత్తమ స్థానం కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మంత్రి ఫరూఖ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.