చేగుంట మండలం వడియారం గ్రామంలో సెహగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైటెక్ సీడ్ కంపెనీ సహకారంతో మినీ కిసాన్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా రైతుల సాధికారత, వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడం లక్ష్యంగా ఉంచారు. చేగుంట మండలంలోని 10 గ్రామాలను సెహగల్ ఫౌండేషన్ దత్తత తీసుకొని వివిధ వ్యవసాయ కార్యక్రమాలు చేపడుతుంది.
ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా రైతులను, ప్రగతిశీల మహిళా రైతులను శాలువాలు, మెమెంటోలు అందజేసి ఘనంగా సన్మానించారు. మహిళా రైతులు ఆధునిక వ్యవసాయ విధానాలను అలవర్చుకోవాలని, మెరుగైన యాజమాన్య పద్ధతుల ద్వారా ఆదాయం పెంచుకోవచ్చని స్పష్టం చేశారు.
మహిళా రైతుల ఆర్థిక స్థితి మెరుగుపరచడం, వారి నైపుణ్యాలను పెంపొందించడమే ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో మహిళా రైతులకు మరిన్ని శిక్షణా కార్యక్రమాలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సెహగల్ ఫౌండేషన్ ప్రోగ్రాం ఆఫీసర్ వాణి శేఖర్, స్థానిక తహసిల్దార్ నారాయణ, వ్యవసాయ సహాయ సంచాలకులు రాజ్ నారాయణ, డాక్టర్ రవి (కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త), హైటెక్ సీడ్ మేనేజింగ్ డైరెక్టర్ మోయినావుద్దీన్ హుస్సేన్, హైటెక్ సీడ్ కంపెనీ ప్రతినిధులు బిందు, డాక్టర్ విభ, డాక్టర్ గాయత్రి తదితరులు పాల్గొన్నారు.