ఎల్బీనగర్ నియోజకవర్గంలోని లింగోజిగూడ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జీతాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మినిస్టర్ క్వార్టర్స్‌లో స్పీకర్‌కు వినతిపత్రం అందజేశారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా ఎన్నికై 14 నెలలు గడుస్తున్నా తన నియోజకవర్గంలో అభివృద్ధికి సంబంధించిన ఏ చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు.
ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కేసీఆర్ నియోజకవర్గ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నియోజకవర్గ అభివృద్ధి కంటే తన స్వంత ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. అందుకే ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకున్న జీతాన్ని తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ కార్పొరేటర్ మాట్లాడుతూ, ప్రజల ఆదరణ కోల్పోయిన కేసీఆర్ అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించారని అన్నారు. తన నియోజకవర్గ ప్రజల కోసం పనిచేయని ఎమ్మెల్యే ప్రజాధనం వృథా చేయడం సమంజసం కాదని చెప్పారు. ప్రజలకు సేవ చేయకుంటే ఆ పదవికి అర్హత లేదని రాజశేఖర్ రెడ్డి అన్నారు.
ఈ అంశాన్ని అసెంబ్లీలో చర్చించి కేసీఆర్ జీతంపై తగిన నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ఇకపై ఎమ్మెల్యేలు ప్రజా సేవే లక్ష్యంగా పనిచేయాలని, లేకపోతే వారికి ప్రజలే బుద్ధి చెప్పే రోజు దూరం లేదని హెచ్చరించారు. ఈ వినతిపత్రం ప్రభుత్వంపై చర్చకు దారితీస్తుందా అనే విషయంపై ఆసక్తి నెలకొంది.