King Kohli Bowling: విరాట్ కోహ్లీ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది అతని అద్భుతమైన బ్యాటింగ్. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన కోహ్లీ గురించి తాజాగా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినీస్(Marcus Stoinis) చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సరదాగా ఆడే బ్యాక్‌యార్డ్ క్రికెట్ కోసం తన ఫేవరెట్ జట్టును ఎంపిక చేసిన స్టోయినీస్.. అందరూ బ్యాటర్‌గా భావించే విరాట్ కోహ్లీని బౌలర్‌గా ఎంచుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. స్టార్ స్పోర్ట్స్ యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన స్టోయినీస్.. కోహ్లీ వేసే పార్ట్‌టైమ్ బౌలింగ్‌ను తక్కువ అంచనా వేయొద్దని చెప్పాడు. అతని బౌలింగ్ శైలి సాంప్రదాయ బౌలర్లలా ఉండదని, అదే ప్రత్యర్థి బ్యాటర్లను అయోమయంలోకి నెట్టగలదని అభిప్రాయపడ్డాడు. అందుకే సరదా క్రికెట్ మ్యాచ్‌ల్లో కోహ్లీని మిస్టరీ బౌలర్‌గా తన జట్టులో ఎంపిక చేసుకుంటానని తెలిపాడు.
బ్యాటింగ్‌తో పాటు కోహ్లీ బౌలింగ్‌లోనూ కొన్ని గుర్తుండిపోయే ప్రదర్శనలు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో 4 వికెట్లు, వన్డేల్లో 5 వికెట్లు సాధించిన అతడు, ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున కూడా 4 వికెట్లు పడగొట్టాడు. 2016లో గుజరాత్ లయన్స్‌పై 25 పరుగులకు 2 వికెట్లు అతని అత్యుత్తమ ఐపీఎల్ బౌలింగ్ గణాంకాలు. 2023 వన్డే ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్ ఎడ్వర్డ్స్ వికెట్ తీసి దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత వన్డేల్లో వికెట్ నమోదు చేశాడు. ప్రస్తుతం టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన కోహ్లీ, వన్డేలు మరియు ఐపీఎల్‌పైనే దృష్టి పెట్టాడు. రాబోయే వెస్టిండీస్ వన్డే సిరీస్‌లో మరోసారి భారత జట్టు తరఫున బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.
ALSO READ: Skating Bonam | స్కేటింగ్‌పై బోనం.. 9 ఏళ్ల తన్విక అరుదైన ఘనత!
