తెలంగాణలో బీజేపీకి ఎదిగే అవకాశమే ఇవ్వమని చేసిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత కే లక్ష్మణ్ గురువారం స్పందించారు.
లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల పరిస్థితి బలహీనంగా ఉందని, తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలు తుమ్మితే పడిపోతాయని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాహుల్ గాంధీని మెప్పించేందుకు చేయబడిన ప్రయత్నమేనని ఆరోపించారు.
బీజేపీని బ్రిటీష్ వారసత్వ పార్టీగా రేవంత్ విమర్శించడాన్ని లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీనే బ్రిటీష్ పాలకుల వారసత్వాన్ని కొనసాగిస్తోందని, వారి పాలనను అనుసరిస్తూ ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.
నిజాం పాలనలో రజాకార్లను తరిమికొట్టిన ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్‌ను కూడా దేశం నుంచి తరిమికొడతారని హెచ్చరించారు. తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమని, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరఫున చివరి సీఎం అవుతారని లక్ష్మణ్ జోస్యం చెప్పారు.