LIVE
Wednesday, November 25, 2026
LIVE
LIVE

Krishna Water Dispute | నాగార్జునసాగర్ నీళ్లపై రెండు రాష్ట్రాల పట్టు.. తుది నిర్ణయం లేకుండానే ముగిసిన సమావేశం

by Bajaswamy
14 views
Telangana Andhra Pradesh Water Dispute

Krishna Water Dispute: కృష్ణా నదీ జలాల పంపకాల వ్యవహారం మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ, జలవనరుల చర్చకు తెరలేపింది. నాగార్జునసాగర్‌లో అందుబాటులో ఉన్న నీటిని ఏ అవసరాలకు వినియోగించాలనే అంశంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు భిన్నమైన ప్రతిపాదనలు చేయడంతో వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. హైదరాబాద్‌లో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) ఆధ్వర్యంలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో ఇరు రాష్ట్రాల అధికారులు తమ నీటి అవసరాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 19 టీఎంసీల నీటిని కేటాయించాలని కోరగా.. తెలంగాణ మాత్రం వచ్చే ఫిబ్రవరి నాటికి తమకు 21 టీఎంసీల నీరు అవసరమవుతుందని స్పష్టం చేసింది. దీంతో నీటి పంపకాలపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగినప్పటికీ ఎలాంటి తుది నిర్ణయం వెలువడలేదు.

నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం 45 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందని తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ రమేశ్ బాబు వెల్లడించారు. వచ్చే ఏడాది జులై వరకు ఈ నిల్వలను జాగ్రత్తగా వినియోగించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ నగర తాగునీటి అవసరాల కోసమే మరో 15 టీఎంసీలు అవసరమని పేర్కొన్నారు. మిగిలిన నీటిని సాగర్ కుడి, ఎడమ కాల్వల అవసరాలకు మాత్రమే వినియోగించాలని తెలంగాణ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అంతేకాకుండా, ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలతో కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేసే పరిస్థితి లేదని వాదించింది. ఆవిరి కారణంగా మరో 5 టీఎంసీల వరకు నీరు నష్టపోయే అవకాశం ఉందని వివరించింది. తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలు మినహాయించిన తర్వాత మిగిలే నీటి వినియోగంపై చర్చించాలని సూచించింది. పల్నాడు వాటర్ గ్రిడ్ అంశాన్ని కూడా తెలంగాణ సమావేశంలో ప్రస్తావించింది. దీనిపై ఏపీ అధికారులు తమకు పూర్తి సమాచారం లేదని పేర్కొన్నట్లు తెలిసింది. మరోవైపు పులిచింతల ప్రాజెక్టులో సుమారు 42 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయని, పట్టిసీమ ద్వారా కూడా కృష్ణా డెల్టాకు నీరు అందుతోందని తెలంగాణ ప్రతినిధులు గుర్తుచేశారు. మొత్తంగా ఇరు రాష్ట్రాలు తమ అవసరాలు, నీటి లభ్యతపై భిన్నమైన లెక్కలు ముందుకు తీసుకురావడంతో కృష్ణా జలాల పంపకాలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. భవిష్యత్తులో నీటి కొరత తలెత్తకుండా KRMB ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం ఎప్పుడు కుదురుతుందో వేచి చూడాలి.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More