WhatsApp Web Security: చేతిలో స్మార్ట్‌ఫోన్ లేకపోయినా కంప్యూటర్ నుంచే వాట్సాప్ సందేశాలు పంపుకోవచ్చు. అందుకే ఉద్యోగులు, విద్యార్థులు, ఇతరులు వాట్సాప్ వెబ్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అయితే పని పూర్తయిన తర్వాత ఒక చిన్న పని మర్చిపోతే మీ వ్యక్తిగత సంభాషణలే ఇతరుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని సైబర్ భద్రతా విభాగం హెచ్చరిస్తోంది. భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) పరిధిలోని నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ (NCTAU) వాట్సాప్ వెబ్ వినియోగదారులను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా ఆఫీసులు, సైబర్ కేఫ్‌లు, ఇతరులు ఉపయోగించే కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్‌ను వినియోగించేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
కంప్యూటర్‌లో వాట్సాప్ వెబ్‌కు లాగిన్ అయిన తర్వాత లాగౌట్ చేయకుండా వదిలేస్తే, ఆ సిస్టమ్‌ను ఉపయోగించే ఇతరులు మీ ఖాతాలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. దీంతో మీ వ్యక్తిగత మెసేజ్‌లు చదవడం, కాంటాక్టులు, గ్రూప్ చాట్‌లను పరిశీలించడం మాత్రమే కాకుండా.. మీ పేరుతో ఇతరులకు సందేశాలు పంపే ప్రమాదం కూడా ఉంది. అంతేకాదు, మీ ఖాతాను అడ్డుపెట్టుకుని ఫిషింగ్ లింకులు పంపడం, ఇతరులను మోసం చేయడం వంటి నేరాలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ ముప్పును నివారించేందుకు కొన్ని కీలక జాగ్రత్తలు పాటించాలి. వాట్సాప్ వెబ్‌లో పని పూర్తయిన వెంటనే లాగౌట్ చేయాలి. కేవలం బ్రౌజర్ ట్యాబ్‌ను మూసివేయడం సరిపోదు. వీలైనంత వరకు పబ్లిక్ కంప్యూటర్లలో ఖాతాకు లాగిన్ కాకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఉపయోగించాల్సి వస్తే ప్రైవేట్ బ్రౌజింగ్ లేదా ఇన్‌కాగ్నిటో మోడ్‌ను ఎంచుకోవాలి. అయినప్పటికీ పని పూర్తయ్యాక లాగౌట్ చేయడం తప్పనిసరి.
అలాగే బ్యాంకింగ్ వివరాలు, ఆర్థిక సమాచారం, సంస్థలకు సంబంధించిన రహస్య పత్రాలను పంపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్, బ్రౌజర్, సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి. గుర్తుతెలియని ఫైళ్లు, అనుమానాస్పద లింకులు, క్రాక్డ్ సాఫ్ట్‌వేర్‌లకు దూరంగా ఉండాలి. మరో ముఖ్యమైన విషయం.. మీ వాట్సాప్‌లోని ‘Linked Devices’ విభాగాన్ని తరచూ తనిఖీ చేయాలి. మీకు తెలియని పరికరం ఏదైనా కనిపిస్తే వెంటనే దాని నుంచి లాగౌట్ చేయాలి. ఖాతాలో అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించినా వెంటనే స్పందించాలి. మొత్తానికి.. వాట్సాప్ వెబ్ వినియోగం సులభమే అయినా, సైబర్ భద్రత విషయంలో నిర్లక్ష్యం తగదు. ప్రతి వినియోగం తర్వాత లాగౌట్ చేయడం, లింక్ అయిన పరికరాలను తనిఖీ చేయడం అలవాటు చేసుకుంటే మీ వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉంటుంది. గుర్తుంచుకోండి.. ఆన్‌లైన్‌లో ఒక్క చిన్న జాగ్రత్త మీ డిజిటల్ భద్రతకు పెద్ద రక్షణ!
ALSO READ: Mathura Wedding Viral Video | పెళ్లికొడుకులకు అదిరిపోయే గిఫ్ట్.. 100 అడుగుల కరెన్సీ దండలు!
