Hamirpur Bridge Collapsed: ఉత్తరప్రదేశ్లో హమీర్పూర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న వంతెన తెల్లవారుజామున ఒక్కసారిగా కూలిపోవడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
ఇంకా కొంతమంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని భావిస్తున్న నేపథ్యంలో పోలీసులు, SDRF బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. అధికారుల వివరాల ప్రకారం.. గురువారం అర్ధరాత్రి నుంచి ప్రాంతంలో భారీ వర్షం, ఈదురుగాలులు వీచాయి.
ఈ సమయంలో వంతెనలోని ఒక భాగంపై నిద్రిస్తున్న కార్మికులపై నిర్మాణ స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో అక్కడే పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, SDRF బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.
హమీర్పూర్ అదనపు ఎస్పీ అర్వింద్ కుమార్ వర్మ మాట్లాడుతూ.. రాత్రి సుమారు 2 గంటల సమయంలో వంతెన కూలిపోయినట్లు సమాచారం అందిందన్నారు. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామని తెలిపారు. ఇప్పటివరకు ఐదుగురు మృతదేహాలను వెలికితీసి గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. మరికొందరు ఇంకా శిథిలాల కింద చిక్కుకుని ఉండే అవకాశం ఉందని తెలిపారు.
ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే మృతుల కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని సూచించారు.








