Kakinada fireworks explosion: కాకినాడ జిల్లా సామర్లకోట సమీపంలోని వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఘోర పేలుడు ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది అని వెల్లడించారు.
ఘటనాస్థలాన్ని హోంమంత్రి అనిత, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నారాయణ, మంత్రి సుభాష్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కలిసి పరిశీలించారు. పేలుడుకు యజమాని నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపమే కారణమని ప్రాథమికంగా తేలిందని తెలిపారు.
భద్రతా నిబంధనలు ఉన్నప్పటికీ ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. బాధ్యులుగా గుర్తించిన నలుగురు అధికారులను సస్పెండ్ చేసి సమగ్ర విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన పర్యవేక్షణ వ్యవస్థలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.
పేలుడులో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు. ప్రతి కుటుంబానికి రూ.20 లక్షల చొప్పున మొత్తం రూ.4 కోట్ల పరిహారం అందజేశారు.
ఇళ్లు లేని వారికి గృహాలు నిర్మించి ఇస్తామని, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల విద్య బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. ఘటనకు సంబంధించి రాజకీయ కోణాలపై కూడా దర్యాప్తు జరుగుతుందని హోంమంత్రి వెల్లడించారు.
పేలుడు ప్రాంతంలో కొన్ని రాజకీయ నాయకుల లింకులపై అనుమానాలు ఉన్నాయని, వాటినీ పరిశీలిస్తామని పేర్కొన్నారు. కలెక్టర్ షాన్మోహన్, ఐజీ అశోక్‌కుమార్, ఎస్పీ బిందుమాధవ్ తదితర అధికారులు పర్యటనలో పాల్గొన్నారు.









