జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను ఘనంగా నిర్వహించేందుకు కొత్తపేట నియోజకవర్గ జనసేన నాయకులు పిలుపునిచ్చారు. ఈనెల 14న పిఠాపురంలో జరగనున్న సభకు అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలి రావాలని నియోజకవర్గ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్, సభ పరిశీలకురాలు సుంకర కృష్ణవేణి, చాగంటి మురళీ కోరారు. ఈ మేరకు మంగళవారం కొత్తపేట కాపు కళ్యాణ మండపంలో కార్యకర్తల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కొత్తపేట నియోజకవర్గం జనసేనకు బలమైన కేంద్రంగా మారిందని, ఈ ఆధిక్యతను సభలో నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు. సభ విజయవంతం చేయడానికి నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామం నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు రావాలని కోరారు. సభకు వెళ్లే సమయంలోనూ, సభలోనూ సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు.
కష్టపడి పనిచేసే ప్రతీ కార్యకర్తకు పార్టీ గుర్తింపు కల్పిస్తుందని బండారు శ్రీనివాస్ పేర్కొన్నారు. జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ స్థాయిలో ఉన్న చిన్న సమస్యలను పరిష్కరించేందుకు తాను టిడిపి నేతలతో కలిసి పని చేస్తానని చెప్పారు. పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు.
ఈ సమావేశంలో కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు మండలాల జనసేన నాయకులు కంఠంశెట్టి చంటి, తోట స్వామి, చేకూరి కృష్ణంరాజు, సూరపురెడ్డి సత్య, వేలాది రామకృష్ణ, సంగీత సుభాష్, సలాది జయప్రకాష్ నారాయణ, గారపాటి శ్రీనివాస్ చౌదరి, బొక్కా ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో జనసైనికులు, మహిళలు హాజరై పార్టీకి మద్దతు తెలిపారు.