గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని చిన కాకానిలో ఆదివారం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పర్యటించారు. అక్కడ నిర్వహించిన సీపీఐ జనసేవాదళ్ శిక్షణా తరగతుల శిబిరాన్ని ఆయన సందర్శించి కార్యకర్తలకు సూచనలు అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.
జగన్ అనాలోచిత నిర్ణయాల వల్ల ఆర్థిక విధ్వంసం చోటు చేసుకుందని, లక్షలాది ఇళ్లను నిర్మించి అవి నిరుపయోగంగా మారిన విధంగా ప్రజాధనాన్ని వృథా చేశారని అన్నారు. విజయవాడ కనకదుర్గ వంతెన నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వరకు నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలు కూడా వినియోగించకుండా ఉన్నాయి అని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులు నిరుపయోగంగా మారిన విధానాన్ని కూడా ఆయన ఎత్తిచూపారు.
జగన్ విధ్వంసకర పాలన కారణంగా ప్రజలు చంద్రబాబును తిరిగి అధికారం తీసుకురాగలిగారని అన్నారు. చంద్రబాబు అభివృద్ధి దృక్పథంతో ముందుకెళ్తున్న నాయకుడని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధిలో నూతన దిశగా పని చేసే వ్యక్తి చంద్రబాబునని నారాయణ ప్రశంసించారు.
కాగా, పీ4 పాలసీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పాలసీ కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేలా ఉంటుందే కానీ పేదలకు ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని ప్రైవేటుపరం చేసే ప్రయత్నంగా పీ4 విధానాన్ని అభివర్ణించారు. తాము దీనికి పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు.