బంగ్లాదేశ్ స్వాతంత్ర్యానికి ఎందరో ప్రాణత్యాగాలు చేసిన సంగతి ఎవ్వరూ మరవలేరు. ఈ త్యాగాలను గుర్తుంచేందుకు తమ ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో ముక్తి జోధా కాంప్లెక్స్‌లు నిర్మించిందని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పేర్కొన్నారు. స్వేచ్ఛ కోసం పోరాడిన వారి చరిత్రను తెలియజేయడం తన ప్రభుత్వం కర్తవ్యంగా భావించిందని ఆమె చెప్పారు.
అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూనస్ చరిత్రను తుడిచివేయాలని కుట్రలు పన్నుతున్నారని హసీనా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముక్తి జోధా కాంప్లెక్స్‌లపై అల్లరి మూకలతో దాడులు చేయిస్తున్నారని, స్వాతంత్ర్య సమరయోధుల జ్ఞాపకాలను చెరిపివేయాలని యూనస్ పన్నిన కుట్రలో భాగంగా ఇది జరుగుతోందని ఆరోపించారు. చరిత్రను మార్చాలని యత్నిస్తే, ప్రజలు సహించరని హెచ్చరించారు.
ఇటీవలి అల్లర్ల కారణంగా హసీనా బంగ్లాదేశ్‌ను విడిచి, తాత్కాలికంగా భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఆమెపై నేరారోపణలు, అరెస్టు వారెంట్లు జారీ అయినప్పటికీ ప్రజలతో నిత్యం వీడియో సందేశాల ద్వారా మమేకమవుతున్నారు. తాజాగా విడుదల చేసిన వీడియోలో యూనస్‌పై హసీనా ఘాటైన విమర్శలు చేశారు. చరిత్రను తుడిచే ప్రయత్నం చేయడం యూనస్ చేసే పెద్ద పొరపాటుగా నిలుస్తుందని హెచ్చరించారు.
తాను త్వరలోనే తిరిగి వస్తానని, బంగ్లాదేశ్ ప్రజలకు ధైర్యం చెప్పడానికి తన శ్వాస మిగిలే వరకు పోరాడతానని హసీనా స్పష్టం చేశారు. యూనస్ చేస్తున్న కుట్రలకు త్వరలోనే ప్రజలే గుణపాఠం చెప్తారని పేర్కొన్నారు. నిప్పుతో చెలగాటమాడేవారిని అదే నిప్పు కాలుస్తుందని యూనస్‌ను హెచ్చరిస్తూ, తన లక్ష్యం స్వేచ్ఛ కోసం పోరాడిన వారిని గౌరవించడమేనని తెలిపారు.