Income Tax Retur: పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారం ఇచ్చింది. 2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) ఫారాలను ఆదాయపు పన్ను శాఖ నోటిఫై చేసింది.చిన్న, మధ్యతరహా పన్ను చెల్లింపుదారుల కోసం ఉద్దేశించిన ఐటీఆర్-1, ఐటీఆర్-4 ఫారాలను ఇప్పటికే విడుదల చేయగా.. తాజాగా ఐటీఆర్-2, ఐటీఆర్-3, ఐటీఆర్-5, ఐటీఆర్-6, ఐటీఆర్-7తో పాటు సవరించిన రిటర్నుల కోసం ఉపయోగించే ఐటీఆర్-యూను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
అంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో పొందిన ఆదాయానికి ఈ ఫారాల ద్వారా రిటర్నులు దాఖలు చేయవచ్చు. ఆడిట్ అవసరం లేని వ్యక్తులు సాధారణంగా జులై 31లోపు రిటర్నులు సమర్పించాలి.
ఐటీఆర్-1 (సహజ్) అనేది వార్షిక ఆదాయం రూ.50 లక్షల వరకు ఉన్న వారికి వర్తిస్తుంది. జీతం, ఒక ఇంటి నుంచి వచ్చే ఆదాయం, వడ్డీ వంటి ఇతర ఆదాయాలు, అలాగే ఏడాదికి రూ.5,000 వరకు వ్యవసాయ ఆదాయం ఉన్న వ్యక్తులు ఈ ఫారం ఎంచుకోవచ్చు.
ఐటీఆర్-4 (సుగమ్) మాత్రం వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం పొందే వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, అలాగే ఎల్‌ఎల్‌పీ కాని సంస్థలు దాఖలు చేయవచ్చు.
మూలధన లాభాలు ఉన్న వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు ఐటీఆర్-2ను ఎంచుకోవాలి. అయితే వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం ఉంటే ఐటీఆర్-3 వర్తిస్తుంది. ఐటీఆర్-5ను సంస్థలు, ఎల్‌ఎల్‌పీలు, సహకార సంఘాలు దాఖలు చేయాలి.
ఐటీఆర్-6 కంపెనీల చట్టం కింద నమోదైన కంపెనీల కోసం ఉండగా.. ఐటీఆర్-7ను ట్రస్టులు, స్వచ్ఛంద సంస్థలు, దాతృత్వ సంస్థలు ఉపయోగించాలి. సరైన ఫారం ఎంపిక చేసుకోవడం వల్ల రిటర్ను దాఖలు ప్రక్రియ సులభమవడంతో పాటు, పొరపాట్లు కూడా తగ్గుతాయి.








