Honda company: జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హోండా తన 70 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా వార్షిక నష్టాలను నమోదు చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టినప్పటికీ ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగకపోవడంతో కంపెనీ ఆర్థికంగా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. 2026 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి హోండా $423 బిలియన్ ఆపరేటింగ్ నష్టాన్ని ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా ఈవీలకు డిమాండ్ తగ్గడం, అమెరికా విధాన మార్పులు, చైనా కంపెనీల నుంచి పెరిగిన పోటీ హోండాపై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమెరికాలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ఇచ్చే 7,500 డాలర్ల పన్ను రాయితీ రద్దు కావడం కంపెనీ అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపింది. అదనంగా దిగుమతి కార్లు, ఆటో పార్ట్స్‌పై పెరిగిన టారిఫ్‌లు కూడా లాభాలను తగ్గించాయి.
1957లో స్టాక్ మార్కెట్లో లిస్టైన హోండా ప్రస్తుతం జపాన్‌లో రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా కొనసాగుతోంది. అయితే మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మారడంలో పాత ఆటో కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఖర్చులను తగ్గించేందుకు చైనాలో తక్కువ ధరలకు లభించే విడిభాగాలను ఉపయోగించనున్నట్లు హోండా ప్రకటించింది. అలాగే కొన్ని ఈవీ ఉత్పత్తి ప్రాజెక్టులను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఇకపై మోటార్‌సైకిల్ వ్యాపారం, హైబ్రిడ్ వాహనాలు, ఫైనాన్షియల్ సర్వీసులపై ఎక్కువ దృష్టి పెట్టనుంది.
హోండా సీఈఓ తొషిహిరో మిబే 2030 నాటికి ఈవీ అమ్మకాల లక్ష్యాలను తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. 2040 నాటికి పూర్తిగా ఈవీ వాహనాలకే మారాలన్న ప్రణాళికను కూడా వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు.








