2013లో హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ వద్ద జరిగిన జంట బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ పేలుళ్లలో 18 మంది ప్రాణాలు కోల్పోగా, 130 మందికిపైగా గాయపడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురికి 2016 డిసెంబర్ 13న NIA కోర్టు ఉరిశిక్ష విధించింది.
ఈ తీర్పును తోసిపుచ్చాలని కోరుతూ దోషులు తెలంగాణ హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ పీ శ్రీసుధ ధర్మాసనం విచారణ జరిపి, మంగళవారం తీర్పు వెలువరించింది. దోషుల పిటిషన్‌ను ఖారజు చేస్తూ, NIA కోర్టు తీర్పునే సమర్థించింది.
ఈ కేసులో అసదుల్లా అక్తర్, అక్తర్ హుస్సేన్, తహసీన్ అక్తర్, అజాజ్ షేక్, జియా ఉర్ రెహ్మాన్‌లకు ఉరిశిక్ష ఖరారైంది. వీరందరూ ఇండియన్ ముజాహిదీన్ అనే ఉగ్రవాద సంస్థకు చెందినవారని అధికారులు నిర్ధారించారు. వీరు ఈ ఘాతక దాడికి సంబంధించిన ప్రణాళిక, అమలు లలో కీలక పాత్ర పోషించారు.
ప్రధాన నిందితుడు రియాజ్ భక్తల్ మాత్రం ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. అతడిని పట్టుకునే చర్యలు కొనసాగుతున్నాయి. ఈ తీర్పుతో బాధిత కుటుంబాలకు కొంత న్యాయం జరిగిందన్న భావన వ్యక్తమవుతోంది. అధికారులు ఈ తీర్పును ఒక కీలక న్యాయ విజయం అని పేర్కొన్నారు.