టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆటతీరుపై మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక సూచనలు చేశారు. రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభిస్తున్నప్పటికీ, ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోతున్నాడని ఆయన అభిప్రాయపడ్డారు. అతడి ఆటతీరులో నిలకడ లేకపోవడంతో జట్టుకు ఆశించిన ప్రయోజనం దక్కడం లేదని అన్నారు.
రోహిత్ శర్మ 25 పరుగులతో కాకుండా, 25 ఓవర్ల పాటు క్రీజులో ఉండేందుకు ప్రయత్నించాలన్నారు. రోహిత్ ఎక్కువసేపు క్రీజులో నిలిస్తే, టీమిండియా 25 ఓవర్లకే 200 స్కోరు చేయగలదని గవాస్కర్ విశ్లేషించారు. ఆ తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్ స్వేచ్ఛగా, ధాటిగా ఆడేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. ఈ మార్పు జట్టుకు ఎంతో మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు.
గత రెండేళ్లుగా రోహిత్ ఆటతీరులో స్థిరత లేకపోవడంతో, అతడి ప్రదర్శనపై విమర్శలు వస్తున్నాయని గవాస్కర్ పేర్కొన్నారు. కొన్ని మ్యాచ్‌లలో మాత్రమే అతడు ప్రభావాన్ని చూపిస్తున్నా, ఆ ఇన్నింగ్స్‌లు అతడి ప్రతిభకు తగిన మచ్చుతునకగా కనిపించడంలేదన్నారు. బ్యాట్స్‌మెన్‌గా సంతృప్తికరమైన ఇన్నింగ్స్‌లు ఆడాల్సిన అవసరం ఉందని సూచించారు.
ప్రారంభ ఓవర్లలో రోహిత్ శర్మ అవుట్ కాకుండా క్రీజులో నిలవడం టీమిండియాకు ఎంతో లాభకరమని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. తొలి 7-8 ఓవర్లు నిలకడగా ఆడితే, కనీసం 25 ఓవర్లు క్రీజులో ఉంటే జట్టు విజయానికి సహాయపడతాడని అన్నారు. రోహిత్ తన ఆటతీరులో మార్పు చేసుకోవాలని, స్థిరత కోసం కృషి చేయాలని సూచించారు.