సుదీర్ఘకాలం సహజీవనం అనంతరం పెళ్లి మోసం పేరుతో పెట్టే అత్యాచారం కేసులు చట్టపరంగా నిలవవని సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగిక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ కేసులు పెట్టడాన్ని ఆమోదించలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగిపై క్రిమినల్ చర్యలు రద్దు చేస్తూ తీర్పును వెలువరించింది.
ఈ కేసులో 16 ఏళ్లుగా లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న మహిళా లెక్చరర్ తన సహజీవన భాగస్వామిపై పెళ్లి మోసం ఆరోపణలు పెట్టింది. అయితే ఇద్దరూ చదువుకున్నవారేనని, పరస్పర అంగీకారంతోనే సంబంధాన్ని కొనసాగించారని కోర్టు పేర్కొంది. లైంగిక సంబంధాన్ని కేవలం పెళ్లి హామీతోనే ఏర్పాటు చేసుకున్నారని నిర్ధారించడం కష్టమని వ్యాఖ్యానించింది.
నిందితుడు బలవంతంగా లేదా మోసపూరితంగా మహిళను లైంగికంగా వాడుకున్నాడని నిరూపించలేమని కోర్టు అభిప్రాయపడింది. వేర్వేరు పట్టణాల్లో నివసించినా తరచూ కలుసుకుంటూ వచ్చారని, ఇది లవ్ ఫెయిల్యూర్ లేదా లివ్-ఇన్ బ్రేకప్ కేసుగా పరిగణించాల్సిందని స్పష్టం చేసింది.
పెళ్లి పేరుతో మోసమని పేర్కొన్నప్పటికీ, ఇన్నేళ్ల పాటు లైంగిక సంబంధం కొనసాగడం చూస్తే ఇది పరస్పర అంగీకారంతోనే జరిగినదని కోర్టు తేల్చిచెప్పింది. దీన్ని అత్యాచారంగా పరిగణించలేమని, సహజీవనం ఉన్నంత కాలం న్యాయపరమైన చెల్లుబాటు ఉండదని పేర్కొంది. ఇలాంటి ఆరోపణలు విశ్వసనీయత కోల్పోతాయని, ఈ తీర్పు భవిష్యత్తులో అనేక కేసులకు మార్గదర్శకంగా నిలుస్తుందని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.