తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి గురువారం అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. చాలా కాలం తర్వాత నాగంను కలుసుకున్న చంద్రబాబు ఆయనను ఆప్యాయంగా పలకరించారు. ఆరోగ్య పరిస్థితిని, కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన సందర్భంగా నాగం జనార్థన్ రెడ్డి, సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. నాటి కేసులు ఎట్టకేలకు కొట్టివేయడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా పోరాటాల్లో భాగంగా కేసులు ఎదుర్కొన్న టీడీపీ నేతలకు న్యాయం జరగడం ఆనందంగా ఉందని అన్నారు.
ఈ భేటీలో ఇద్దరు నేతలు గత రాజకీయ ఘటనలను గుర్తుచేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజా పోరాటాల్లో కలిసి పాల్గొన్న రోజులను స్మరించుకున్నారు. పార్టీ ఆదేశిస్తే నాగం నిర్భయంగా ముందుకు సాగేవారని, ఆయన నిజమైన ఫైర్ బ్రాండ్ లీడర్ అని చంద్రబాబు ప్రశంసించారు.
నాలుగోసారి చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడాన్ని చూసి తాను ఆనందించానని నాగం అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, ప్రజల శ్రేయస్సే తన ఆకాంక్ష అని చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో తెలుగు ప్రజలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.