Donald Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇరాన్‌పై ప్రతిపాదిత దాడులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఆయన, రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం దిశగా కీలక పురోగతి సాధించామని వెల్లడించారు. త్వరలోనే ఈ ఒప్పందానికి సంబంధించిన అవగాహన పత్రం (ఎంవోయూ)పై సంతకాలు జరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ట్రంప్ వివరాల ప్రకారం, ఖతార్ మధ్యవర్తిత్వంలో కొనసాగిన చర్చలు సానుకూల ఫలితాలు ఇచ్చాయని, పలు అంశాలపై అంగీకారం కుదిరిందన్నారు. యూరప్‌లో జరిగే కార్యక్రమంలో ఈ ఒప్పందంపై అధికారిక సంతకాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. అలాగే అమెరికా, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, టర్కీ, పాకిస్థాన్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఈజిప్ట్ తదితర దేశాలు ఈ ప్రక్రియకు మద్దతు తెలుపుతున్నాయని చెప్పారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ వెంటనే ఖండించింది. అమెరికాతో ఎటువంటి తుది ఒప్పందం కుదరలేదని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
చర్చలు కొనసాగుతున్నప్పటికీ, ఇంకా కొన్ని అంశాలపై స్పష్టత అవసరమని పేర్కొంది. అమెరికా ప్రతిసారి తన వైఖరిని మార్చుకుంటోందని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బాగేహి ఆరోపించారు. ఇదే సమయంలో ట్రంప్ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ కూడా స్పందించింది. తుది ఒప్పందం పూర్తయినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొంది. దీంతో అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన శాంతి ఒప్పందంపై అంతర్జాతీయ స్థాయిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రాబోయే రోజుల్లో జరిగే చర్చలు, సంతకాల కార్యక్రమాలు ఈ అంశంపై మరింత స్పష్టత ఇవ్వనున్నాయి.









