పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ఉద్దేశించిన సదస్సు కోసం బ్రెజిల్ ప్రభుత్వం పచ్చటి చెట్లను నరికిస్తోంది. పచ్చదనం పెంచుకోవాల్సిన అవసరాన్ని చాటిచెప్పే సదస్సు కోసం బ్రెజిల్ ప్రభుత్వం పచ్చదనాన్ని తొలగించి అడవులను నాశనం చేస్తోంది. ఇది సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. ‘పచ్చదనాన్ని పెంచండి’ అని ప్రపంచానికి సందేశం ఇస్తూ, అమెజాన్ అడవులు ధ్వంసం కావడం ఎలా సమంజసమని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
అమెజాన్ అడవులు ప్రపంచవ్యాప్తంగా ఎంతో కీలకమైనవి. వాతావరణంలో కర్బన ఉద్గారాలను గ్రహించి భూమి వేడెక్కకుండా చూడటంలో, జీవవైవిధ్యాన్ని కాపాడటంలో అమెజాన్ అడవులకు కీలకపాత్ర ఉంది. అయితే, బ్రెజిల్ ప్రభుత్వం ఈ అడవులను ధ్వంసం చేయడం, పర్యావరణ పరిరక్షణ సదస్సు కోసం అడవుల్లో మార్పులు చేయడం ప్రజలలో ఆగ్రహాన్ని కలిగిస్తుంది. అమెజాన్ అడవుల ధ్వంసం వల్ల వన్యప్రాణులు, పరిసరాలపై తీవ్ర ప్రభావం పడవచ్చని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఈ ఏడాది నవంబర్ 30న బ్రెజిల్‌లో క్లైమేట్ సమిట్ జరగనుంది. ప్రపంచం నలుమూలల నుండి సుమారు 50,000 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారని అంచనా. ఈ సదస్సులో భూమి పై పెరుగుతున్న కర్బన ఉద్గారాలు, కాలుష్యం వంటి అంశాలపై చర్చించనున్నారు. ప్రపంచానికి పచ్చదనాన్ని పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవాలని సందేశం ఇవ్వడం ఈ సదస్సు ఉద్దేశం.
ఈ సదస్సు నిర్వహణ కోసం బ్రెజిల్ ప్రభుత్వం అమెజాన్ అడవులలో కొత్త రోడ్డును నిర్మిస్తోంది. ఈ రోడ్డు నిర్మాణం కోసం వందలాది పచ్చని చెట్లను నరికేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామం స్థానికులు, పర్యావరణవేత్తలు, నెటిజన్ల నుంచి తీవ్ర నిరసనలకు గురైంది. వన్యప్రాణులకు ప్రమాదం కలిగేలా మారిన ఈ మార్గం ప్రకృతి సంతులనాన్ని దెబ్బతీయవచ్చని అభిప్రాయపడుతున్నారు.