Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు. వాహనాల పొగ నుంచి నిర్మాణ పనుల వల్ల వెలువడే దుమ్ము వరకు ప్రతి అంశంపై నిఘా పెట్టారు. వింటర్ యాక్షన్ ప్లాన్ ప్రారంభమైన తొలిరోజే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానాలు విధించారు.
తొలిరోజే రూ.68.4 లక్షల జరిమానా
అధికారిక సమాచారం ప్రకారం.. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా సుమారు 15 వేల వాహనాలను తనిఖీ చేశారు. పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికెట్ లేని 566 వాహనాలకు రూ.56.6 లక్షల జరిమానా విధించారు. ఢిల్లీ సరిహద్దుల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన 1,539 వాహనాలను వెనక్కి పంపించారు. వీటికి సంబంధించి రూ.2 లక్షల జరిమానా వసూలు చేశారు. బీఎస్-6 ప్రమాణాలు లేని ఇతర ప్రాంతాల వాహనాలపైనా ఆంక్షలు అమలు చేశారు.
నిర్మాణ ప్రాంతాలపై నిఘా
నిర్మాణ పనుల వల్ల దుమ్ము కాలుష్యం పెరగకుండా అధికారులు 300 నిర్మాణ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. వీటిలో 32 చోట్ల నిబంధనల ఉల్లంఘనలు గుర్తించి రూ.9.8 లక్షల పర్యావరణ నష్టపరిహారం విధించారు. నిబంధనలు పాటించని కొన్ని నిర్మాణాలకు పనులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయగా, మరికొన్ని సంస్థలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
ఫిబ్రవరి 28 వరకు అమల్లో ప్లాన్
ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా ప్రజలు కాలుష్య నియంత్రణ చర్యలకు సహకరించాలని కోరారు. వింటర్ యాక్షన్ ప్లాన్ ఫిబ్రవరి 28 వరకు అమల్లో ఉండనుంది. ఇందులో భాగంగా పార్కింగ్ ఫీజుల పెంపు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందితో విధులు నిర్వహించే నిబంధనలు అమలు చేయనున్నారు. సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వాహనాలు, అత్యవసర సేవలకు మినహాయింపులు కల్పించారు. ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం తనిఖీలను మరింత కఠినతరం చేయడంతో పాటు, నిబంధనల అమలుపై అధికారులు దృష్టి సారించారు. ప్రజల సహకారం, ఉల్లంఘనలపై నిరంతర పర్యవేక్షణతోనే కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది.
