Mana Mitra WhatsApp: తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సహాయక చర్యలను మరింత వేగవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ సేవలను వినియోగిస్తోంది. ఇందులో భాగంగా ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా బాధితులు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లే సదుపాయాన్ని కల్పించింది. మురసు తుఫాన్ కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, చెట్లు కూలిపోవడం, గోడలు దెబ్బతినడం, ఇళ్లలోకి వరద నీరు చేరడం వంటి సమస్యలను ప్రజలు వాట్సాప్‌లోనే ఫిర్యాదు చేయవచ్చు. సమస్యకు సంబంధించిన ఫొటోలను కూడా జతచేసే వెసులుబాటు ఉంది. ఈ ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపించి పరిష్కార చర్యలు చేపట్టేలా వ్యవస్థను రూపొందించినట్లు ఆర్టీజీఎస్ అధికారులు వెల్లడించారు.
వాట్సాప్‌లో ఫిర్యాదు చేయడం ఎలా?
బాధితులు ముందుగా 9552300009 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ‘Hi’ అని మెసేజ్ పంపాలి. అనంతరం కనిపించే సేవల జాబితాలో ‘Murasu Cyclone Issue’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత ‘Report Issue’పై క్లిక్ చేసి కన్ఫర్మ్ చేయాలి. ఆపై ‘Registration’ ఆప్షన్ ద్వారా తమ పేరు, జిల్లా, మండలం వివరాలను నమోదు చేయాలి. చివరగా తమ ప్రాంతంలో తుఫాన్ కారణంగా ఎదురైన ఇబ్బందులను వివరంగా తెలియజేసి, అవసరమైతే ఫొటోలను కూడా అప్‌లోడ్ చేయవచ్చు. ఇలా అందిన ఫిర్యాదులను సంబంధిత ప్రాంత అధికారులకు చేరవేస్తారు.
అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్‌లైన్
తుఫాన్ సమయంలో ప్రాణ, ఆస్తి నష్టానికి దారితీసే అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఏపీఎస్‌డీఎంఏ అందుబాటులో ఉంచిన హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. తుఫాన్ బాధితులు తమ సమస్యలను అధికారులకు త్వరగా తెలియజేసేందుకు మనమిత్ర వాట్సాప్ సేవ ఉపయోగపడనుంది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
