CP Sajjanar: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీ కోసం భారీ స్థాయిలో సెక్యూరిటీ మరియు మెడికల్ ఏర్పాట్లు నిర్వహించారు. ఈ ఏర్పాట్లను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
సీపీ సజ్జనార్‌తో పాటు జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్, గోల్కొండ డీసీపీ చంద్ర మోహన్ తదితరులు క్యూలైన్లు, కౌంటర్లు, మినీ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును సమీక్షించారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు వేలాది మంది భక్తులు చేరుకోవడంతో పరిసర ప్రాంతాల్లో రద్దీ భారీగా పెరిగింది.
ముఖ్యంగా నాంపల్లి మెట్రో స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. భక్తుల భద్రత కోసం వైద్య శాఖ ప్రత్యేకంగా మూడు హెల్త్ క్యాంప్‌లను ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితుల కోసం ఐదు అంబులెన్సులు సిద్ధంగా ఉంచగా, అవసరమైతే రోగులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. అలాగే అగ్నిమాపక శాఖ మూడు ఫైర్ ఇంజిన్లను రంగంలోకి దించింది.
ప్రభుత్వం తరఫున లక్షకు పైగా చేప పిల్లలతో చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. ఇప్పటికే సుమారు 50 వేల మంది భక్తులు చేరుకున్నట్లు సమాచారం.
ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచి భక్తులు క్యూలైన్లలో నిలబడనుండగా, రాత్రి 9 గంటల 1 నిమిషానికి శుభ ముహూర్తం ప్రకారం చేప మందు పంపిణీ ప్రారంభించనున్నారు. ఉబ్బసం, ఆస్తమా బాధితులు పెద్ద సంఖ్యలో హాజరవుతుండటంతో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
భద్రత, వైద్య సహాయం, తాగునీరు వంటి అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు నాంపల్లి పరిసరాల్లో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.
ALSO READ: Philippines Earthquake | ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. 7.8 తీవ్రతతో తీర ప్రాంతాల్లో కలకలం








