మాచారెడ్డి గ్రామ మాజీ ఎంపీటీసీ రావుల వినోద ప్రభాకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మహమ్మద్ షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ అంటేనే షబ్బీర్ అలీ, షబ్బీర్ అలీ అంటేనే కాంగ్రెస్ అని, గత 40 ఏళ్లుగా ఆయన పార్టీ కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కేసీఆర్ అసెంబ్లీలో షబ్బీర్ అలీ పేరును ప్రస్తావించారని, బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని పలుమార్లు ఆహ్వానించారని తెలిపారు. అయినప్పటికీ షబ్బీర్ అలీ కాంగ్రెస్ నమ్మకాన్ని వదలకుండా పార్టీతోనే కొనసాగారని, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీల సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి కోరిక మేరకు నిజామాబాద్ నుండి పోటీ చేసినప్పటికీ స్వల్ప మెజారిటీ ఓట్లతో ఓటమి చవిచూడాల్సి వచ్చిందని అన్నారు. అయితే, షబ్బీర్ అలీ కాంగ్రెస్ కోసం చేసిన కృషిని గుర్తించి, ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని వినోద ప్రభాకర్ అన్నారు.
షబ్బీర్ అలీ పార్టీ కోసం జీవితాన్ని అంకితం చేశారని, ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ కట్టబెట్టితే పార్టీకి మరింత బలం చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి రాహుల్ గాంధీ, మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.