CM Revanth Reddy: ఎస్‌ఐఆర్ (SIR)పై పార్టీ నేతలందరూ పూర్తి దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఈ అంశంపై పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు మరింత చురుకుగా వ్యవహరించాలని ఆయన సూచించారు. క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు సరిగా జరగకపోతే పేద ప్రజలు నష్టపోయే పరిస్థితులు ఏర్పడవచ్చని హెచ్చరించారు.
జిల్లాల వారిగా నిర్వహించిన అవగాహన కార్యక్రమాలపై తన వద్ద పూర్తి సమాచారం ఉందని పేర్కొన్న సీఎం, కొన్ని ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో స్పందన కనిపించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు SIRపై స్పష్టమైన అవగాహన కల్పించడం ప్రతి నాయకుడి బాధ్యత అని గుర్తుచేశారు.
గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. SIRపై సరైన సమాచారం ప్రజలకు చేరకపోతే సామాజికంగా, పరిపాలనా పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పేద వర్గాల హక్కులు దెబ్బతినే పరిస్థితులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజల్లో అపోహలు తొలగించేలా ప్రచార కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని కోరారు. పార్టీ ఆదేశాలను విస్మరించి నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని సీఎం స్పష్టం చేశారు. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించని ఇంఛార్జ్‌ల స్థానంలో కొత్త వారిని నియమించేందుకు వెనుకాడబోమన్నారు.
పనితీరు మెరుగుపర్చుకోవడానికి 10 రోజుల గడువు ఇస్తున్నామని, ఈ వ్యవధిలో మార్పు కనిపించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో సర్పంచ్‌లు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తల సహకారంతో SIRపై విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
CM Revanth Reddy | SIRపై నిర్లక్ష్యం వద్దు.. కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి అల్టిమేటం
-








