ఏలూరు జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వ హననం చేసేవారిపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అలాంటి పనులు చేసే వారికి అదే చివరి రోజు అవుతుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో స్వేచ్ఛ కోల్పోయిన ప్రజలకు ఇప్పుడు న్యాయం జరిగే కాలమని తెలిపారు. చంద్రబాబు వ్యాఖ్యలు, ఐటీడీపీ కార్యకర్త కిరణ్‌పై ప్రభుత్వం తీసుకున్న చర్యల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అసెంబ్లీలో గతంలో తాను ఎదుర్కొన్న అవమానాలను గుర్తు చేసిన చంద్రబాబు, అదే గౌరవ సభగా మారిన తర్వాత మాత్రమే సీఎం పదవిలో తిరిగి అడుగుపెట్టానని పేర్కొన్నారు. మహిళలపై చెడుగా మాట్లాడితే ఊరుకోనని, ఎవరైనా తప్పు చేస్తే కచ్చితంగా శిక్షిస్తామని అన్నారు. మహిళా గౌరవాన్ని కాపాడేందుకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.
బీసీల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని సంకల్పించిన ప్రభుత్వం, మహాత్మా జ్యోతిబాపూలే ఆశయాల ప్రకారమే ఈ చట్టాన్ని రూపొందిస్తోందని చంద్రబాబు ప్రకటించారు. ఉద్యోగాల్లో 33%, స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. బీసీల భవిష్యత్తు కోసం జిల్లాల వారీగా బీసీ భవనాలు నిర్మించుతున్నామని వివరించారు.
రైతులకు 20 వేల రూపాయలు ఇవ్వడం, బీసీలకు సివిల్స్ కోచింగ్ కేంద్రం, మహిళల పారిశ్రామికాభివృద్ధికి ప్రోత్సాహం వంటి అంశాలను ముఖ్యమంత్రి వెల్లడించారు. పీ-4 ద్వారా సమాజంలోని ప్రతి ఒక్కరికి సంపద అందాలని, పేదల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాకే ఓట్లు అడుగుతామని ప్రకటించారు. చింతలపూడి ప్రాజెక్టు త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు.