Cm Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 2029 లోపు ఇల్లు అందించడం తన బాధ్యత అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
తిరుపతి జిల్లా నాయుడుపేటలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన టిడ్కో గృహ సముదాయాలను ఘనంగా ప్రారంభించిన ఆయన, లబ్ధిదారులతో కలిసి సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెండో విడతలో భాగంగా 2,50,893 మంది పేదలకు గృహప్రవేశం కల్పిస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వం నిర్మించిన టిడ్కో గృహాలు ప్రైవేట్ అపార్ట్‌మెంట్లకు ఏమాత్రం తీసిపోకుండా, పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు, ఇతర మౌలిక వసతులతో ఆధునికంగా రూపొందించామని సీఎం పేర్కొన్నారు.
జీ+3 విధానంలో నిర్మించిన ఈ ఇళ్లలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. కేవలం 21 నెలల్లో రెండు విడతల్లో కలిపి 5.5 లక్షల ఇళ్లను పేదలకు అందించామని వెల్లడించారు.
తిరుపతి జిల్లాలోనే 15,600 ఇళ్లు నిర్మించి అందించామని, 2014లో 8 లక్షలకు పైగా ఇళ్లు పూర్తి చేశామని సీఎం గుర్తు చేశారు. గత ప్రభుత్వం కేంద్ర నిధులను దారి మళ్లించిందని, పేదల ఇళ్ల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.
2029 నాటికి 17.60 లక్షల ఇళ్లు నిర్మించి పేదల గృహ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు.
అదే సమయంలో మహిళలకు రాజకీయాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని, స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు పెంచుతామని చెప్పారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో నెలకు రూ.20 వేల సాయం అందిస్తున్నామని, అవసరమైన గస్తీ బోట్లు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు.
పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని, అమరావతిని హైదరాబాద్, చెన్నై కంటే మెరుగ్గా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.








