Central Government: కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామీణ ప్రజలకు శుభవార్త చెప్పింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా కరువు భత్యం (DA) పెంపుతో పాటు గ్రామీణ అభివృద్ధి, సముద్ర రవాణా భద్రతపై దృష్టి సారించారు.
దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఉద్యోగులు, పెన్షనర్లకు 2 శాతం డీఏ పెంపును ప్రకటించింది. సాధారణంగా సెప్టెంబర్లో రావాల్సిన ఈ ప్రకటన ఆలస్యంగా వచ్చినప్పటికీ, ఇప్పుడు ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనకు ముగింపు పలికింది.
ఈ పెంపుతో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బందికి ఆర్థిక ఊరట లభించనుంది.
సముద్ర రవాణా భద్రతకు భారీ నిధులు
క్యాబినెట్ మరో కీలక నిర్ణయంగా సముద్ర రంగ భద్రత కోసం రూ.13,000 కోట్లతో సావరిన్ మారిటైమ్ ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ఫండ్ ద్వారా భారతీయ నౌకలకు తక్కువ వ్యయంతో బీమా సదుపాయాలు లభించడంతో పాటు, అంతర్జాతీయ వాణిజ్యానికి మరింత భద్రత కలగనుంది.
గ్రామీణ మౌలిక సదుపాయాలపై ఫోకస్
గ్రామీణ రహదారి సదుపాయాల అభివృద్ధికి కేంద్రం మరో కీలక అడుగు వేసింది. ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజనను 2028 వరకు పొడిగిస్తూ రూ.3,000 కోట్లు కేటాయించింది. దీని ద్వారా గ్రామాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడి, ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకునే అవకాశం ఉంది.
మహిళా సాధికారతపై స్పష్టం
మహిళా రిజర్వేషన్ అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. మహిళల హక్కుల విషయంలో రాజీ పడేది లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రతిపక్షాలపై విమర్శలు వ్యక్తం చేశారు.
మొత్తంగా ఈ క్యాబినెట్ నిర్ణయాలు ఉద్యోగులు, గ్రామీణ ప్రజలు మరియు దేశ ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలుస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.








