BSNL Broadband Plan: గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీని మరింత విస్తరించే దిశగా ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL మరో కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. తక్కువ నెలవారీ చార్జీతో ఇంటర్నెట్, వాయిస్ కాలింగ్, వినోద సేవలను ఒకే ప్యాకేజీలో అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. భారత్‌నెట్ ప్రాజెక్టు సహకారంతో రూపొందించిన ఈ ప్లాన్ గ్రామీణ కుటుంబాలు, విద్యార్థులు, ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు సంస్థ తెలిపింది.
ఈ ప్లాన్ ధర నెలకు రూ.259 మాత్రమే. ఇందులో 25 Mbps వరకు బ్రాడ్‌బ్యాండ్ వేగంతో 700GB వరకు హైస్పీడ్ డేటా అందుబాటులో ఉంటుంది. నిర్ణీత డేటా పరిమితి పూర్తైన తర్వాత కూడా ఇంటర్నెట్ సేవ నిలిపివేయకుండా 2 Mbps వేగంతో కొనసాగుతుంది. అదనపు డేటా ఛార్జీలు లేకపోవడం ఈ ప్లాన్‌లో మరో ప్రధాన ఆకర్షణ.
ఈ ప్లాన్‌ను ఎంచుకునే వారికి వేగవంతమైన ఇంటర్నెట్‌తో పాటు భారతదేశంలోని అన్ని టెలిఫోన్ నెట్‌వర్క్‌లకు ఉచిత అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనం కూడా అందుతుంది. కొత్త కనెక్షన్ తీసుకునే వారికి ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు మినహాయించడంతో పాటు Wi-Fi మోడెమ్‌ను కూడా ఎలాంటి అదనపు రుసుము లేకుండా అందించనున్నట్లు BSNL వెల్లడించింది. దీంతో ప్రారంభ ఖర్చు తగ్గి వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూరనుంది.
వినోదాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ప్లాన్‌తో Waves OTT ప్లాట్‌ఫామ్‌కు ఉచిత యాక్సెస్‌ను కల్పిస్తున్నారు. అదనపు సబ్‌స్క్రిప్షన్ అవసరం లేకుండా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ కార్యక్రమాలను వీక్షించే అవకాశం ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో ఇంటర్నెట్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారికి ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో కమ్యూనికేషన్ సేవలను విస్తరించే క్రమంలో BSNL ఇటీవల శాటిలైట్ ఫోన్‌ను కూడా పరిచయం చేసింది. సాధారణ మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులో లేని అడవులు, సముద్ర ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, గనులు వంటి చోట్ల కూడా కమ్యూనికేషన్ కొనసాగించేలా ఈ పరికరాన్ని రూపొందించారు.
BSNL Broadband Plan | BSNL కొత్త ప్లాన్ అదిరింది.. రూ.259కే 700GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్
-








