KCR public meeting: జగిత్యాల జిల్లా మోతేలో ఈ నెల 20వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభ ఏర్పాట్లను పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కలిసి పరిశీలించారు.
సభాస్థలిని పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యే కల్వంకుట్ల సంజయ్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత, తుల ఉమ తదితరులు సందర్శించారు.
ఈ సందర్భంగా విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ, లక్షకు పైగా ప్రజలు హాజరయ్యేలా సభా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. భారీ జనసమూహాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, ప్రజాభీష్టం మేరకే జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలనలో గత రెండున్నరేళ్లలో తెలంగాణ అభివృద్ధి వెనుకబడిందని విమర్శించారు. కేసీఆర్ పాలన పట్ల ప్రజల్లో మళ్లీ ఆశలు పెరుగుతున్నాయని తెలిపారు.
ఎమ్మెల్యే కల్వంకుట్ల సంజయ్ మాట్లాడుతూ, జీవన్ రెడ్డి ఎప్పుడూ అధికారం కోసం పనిచేయలేదని, బీఆర్ఎస్ అభివృద్ధిని గుర్తించి పార్టీలో చేరారని అన్నారు.
స్థానిక ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. జీవన్ రెడ్డి మార్గదర్శకత్వంలో పార్టీ మరింత బలపడుతుందని ఆయన పేర్కొన్నారు.








