కడప జిల్లా బి కోడూరు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో టీచర్‌గా పనిచేస్తున్న వరలక్ష్మి సోమవారం సాయంత్రం మోసపోయారు. స్కూల్ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా, గుర్తుతెలియని వ్యక్తులు కారు ఆపి, తమ కారులో ఎక్కించుకున్నారు.
కొంతదూరం వెళ్లిన తర్వాత వారి ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించడంతో వరలక్ష్మి కారును ఆపించుకుని దిగిపోయారు. అయితే, కొద్దిసేపటి తర్వాత మెడలోని మూడు తులాల సరుడు కనిపించకపోవడంతో మోసపోయినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
బద్వేల్ రూరల్ సీఐ నాగభూషణం ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రజలు అపరిచిత వాహనాలలో ఎక్కకూడదని, తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.
దర్యాప్తులో బి కోడూరు పోలీసులు, గోపవరం ఎస్సై శ్రీకాంత్, స్పెషల్ బ్రాంచ్ ఎస్‌బీ జయరామిరెడ్డి పాల్గొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముఠా గుట్టును రట్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.