Himanta Biswa Sarma: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పొరుగుదేశం బంగ్లాదేశ్(Bangladesh)ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, బంగ్లాదేశ్ వ్యవహారాల్లో దౌత్య మార్గాలు ఫలితం ఇవ్వకపోతే “శస్త్రచికిత్స తప్పనిసరి” అని వ్యాఖ్యానించారు.
చికెన్స్ నెక్‌పై ఆందోళన
భారత భద్రతకు అత్యంత కీలకమైన ‘చికెన్స్ నెక్’ (సిలిగురి కారిడార్) ప్రాంతంపై ఆందోళన సహజమని హిమంత బిశ్వశర్మ అన్నారు. దౌత్యం లేదా ఇతర మార్గాల ద్వారా 20–22 కిలోమీటర్ల కీలక భూభాగాన్ని భారత్ కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఔషధపరమైన చర్యలు విఫలమైతే, శస్త్రచికిత్స అనివార్యమవుతుందని వ్యాఖ్యానించారు.
బంగ్లాదేశ్–చైనా వ్యాఖ్యల నేపథ్యం
ఇటీవల బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ చైనా పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా హిమంత బిశ్వశర్మ ప్రస్తావించారు. భారత ఈశాన్యంలోని ‘సెవెన్ సిస్టర్స్’ రాష్ట్రాలు భూపరివేష్టితంగా ఉండటంతో, సముద్రానికి భారత్ మాత్రమే రక్షకుడని, ఈ ప్రాంతం చైనాకు ఆర్థిక అవకాశంగా మారవచ్చని యూనస్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
also read:2023 వరల్డ్ కప్ తరువాత మానసిక ఒత్తిడికి గురయ్యాను….రోహిత్ సంచలన వ్యాఖ్యలు
సిలిగురి కారిడార్ వ్యూహాత్మక ప్రాధాన్యం
పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి కారిడార్ కేవలం 22 కిలోమీటర్ల వెడల్పుతో ఉండి, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపుర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలను భారత ప్రధాన భూభాగంతో కలుపుతుంది. ఇది నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్‌లకు సమీపంగా ఉండటంతో పాటు చైనా ఆధీనంలోని చుంబీ ప్రాంతానికి కూడా దగ్గరగా ఉంది.
ఈ ప్రాంతంపై దాడి జరిగితే ఈశాన్య భారతం దేశంతో తెగిపోయే ప్రమాదం ఉందని సైనిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
