Adilabad Bus Accident: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం శ్యాంపూర్ వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయం ఆరు గంటల సమయంలో శ్యాంపూర్ బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న TGSRTC బస్సు అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లి బోల్తా పడింది.
ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఈ బస్సు ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్‌కు వెళ్తుండగా ఇరుకైన వంతెనపై నియంత్రణ కోల్పోయినట్లు సమాచారం.
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 37 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు 30 మందికి గాయాలు అయ్యాయి. కండక్టర్ సహా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను బయటకు తీశారు.
గాయపడిన వారిని ఉట్నూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉదయం పొగమంచు ఎక్కువగా ఉండటం, వంతెన ఇరుకుగా ఉండటం ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఈ ఘటనపై రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), ఆదిలాబాద్ ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణ రావు (Jupally Krishna Rao) విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.
శ్యాంపూర్ బ్రిడ్జిపై రక్షణ గోడ లేకపోవడం కూడా ఒక కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read More:MLA, MLC Sports | ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు..ఎక్కడంటే ?









