Ajit Agarkar: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక కాకపోవడంపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టత ఇచ్చారు. షమీని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టలేదని, పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించకపోవడమే ప్రధాన కారణమని తెలిపారు. ఇంగ్లండ్ పరిస్థితుల్లో షమీ అనుభవం జట్టుకు ఎంతో అవసరమని, పూర్తిగా ఫిట్‌గా ఉంటే అతడు ఎంపికలో తొలి వరుసలో ఉండేవాడని చెప్పారు.
వన్డే ప్రపంచకప్ అనంతరం శస్త్రచికిత్స చేయించుకున్న షమీ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాస శిక్షణ పొందుతున్నాడు. టెస్టు క్రికెట్లో ఐదు రోజుల పాటు నిరంతరాయంగా బౌలింగ్ చేసే సామర్థ్యం అవసరమని, సాధారణ ఫిట్నెస్ మాత్రమే సరిపోదని అగార్కర్ వివరించారు. పూర్తి కోలుకోకముందే అతడిని ఆడించడం వల్ల గాయం మళ్లీ తిరగబడే ప్రమాదం ఉందని తెలిపారు.
షమీ దీర్ఘకాల కెరీర్‌ను దృష్టిలో ఉంచుకుని వైద్య బృందం సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి రావాలంటే ముందుగా రంజీ ట్రోఫీ లేదా ఇతర దేశవాళీ టోర్నీల్లో ఆడి మ్యాచ్ ఫిట్నెస్ నిరూపించుకోవాలని సూచించారు. పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించిన తర్వాతే అతడి ఎంపికను పరిశీలిస్తామని, షమీ మునుపటి లయను అందుకుంటే మళ్లీ భారత జట్టుకు కీలక బౌలర్‌గా మారుతాడనే నమ్మకం వ్యక్తం చేశారు.
ALSO READ: Udhayanidhi Stalin | ఉదయనిధికి షాక్.. కేసు నమోదైన గంటల్లోనే అరెస్ట్








