Ayodhya Ram Mandir Trust: శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్వహణలో కీలక అడుగు వేసింది. ట్రస్ట్ తొలి కార్యదర్శిగా ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి జగదీశ్ అఫాలేను నియమించింది. ఆలయ పరిపాలనతో పాటు ఆర్థిక లావాదేవీల పర్యవేక్షణ బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించినట్లు ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. ట్రస్ట్ ఆర్థిక వ్యవహారాలకు సంయుక్త అధికారిగా కూడా ఆయన వ్యవహరించనున్నట్లు సమాచారం. ఇటీవలి కాలంలో రామమందిరానికి వచ్చిన విరాళాల వినియోగంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ నియామకానికి ప్రాధాన్యం ఏర్పడింది.
భవిష్యత్తులో ఆర్థిక లావాదేవీలు మరింత పారదర్శకంగా ఉండేలా ఈ చర్యలు తీసుకున్నట్లు భావిస్తున్నారు. అయితే ఈ పరిణామంపై ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వం, ట్రస్ట్‌ను ప్రశ్నించాయి. సమాజ్‌వాదీ పార్టీ అధికార ప్రతినిధి అశుతోష్ వర్మ మాట్లాడుతూ, కొత్త నియామకంతో విరాళాల నిర్వహణలో ఎలాంటి మార్పులు వస్తాయో ట్రస్ట్ ప్రజలకు వివరించాలని కోరారు.
ఇప్పటి వరకు నమోదైన ఆరోపణలపై తీసుకున్న చర్యల వివరాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ కూడా ట్రస్ట్ పనితీరుపై విమర్శలు గుప్పించారు. పవిత్ర లక్ష్యంతో ఏర్పాటైన ట్రస్ట్‌పై అవినీతి ఆరోపణలు రావడం విచారకరమని పేర్కొన్నారు. ట్రస్ట్‌ను పునర్వ్యవస్థీకరించి శంకరాచార్యులు, ప్రముఖ సన్యాసుల పర్యవేక్షణలో నిర్వహించాలని సూచించారు. అలాగే అయోధ్య ప్రజలకు కూడా ట్రస్ట్‌లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ALSO READ: CP Sajjanar | భారీ వర్షాలపై సజ్జనార్ హెచ్చరిక.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు








