PM Modi: ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యూఢిల్లీలో అత్యున్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ భేటీకి కేంద్ర ప్రభుత్వంలోని కీలక మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అయితే సమావేశానికి సంబంధించిన అధికారిక అజెండాను ప్రభుత్వం వెల్లడించలేదు. ఈ కీలక సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ పాల్గొన్నారు.
అలాగే ఆరోగ్యం, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, పోర్టులు, నౌకాశ్రయాలు, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ కూడా సమావేశానికి హాజరయ్యారు. కేబినెట్ కార్యదర్శితో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొనడంతో ఈ భేటీకి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయ వాణిజ్య మార్గాల్లో భద్రతా సవాళ్ల నేపథ్యంలో ఈ సమావేశం జరిగినట్లు భావిస్తున్నారు.
ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి, ఎర్ర సముద్రం ప్రాంతాల్లో వాణిజ్య నౌకల రాకపోకలకు ఎదురవుతున్న సమస్యలు, భారతీయ నావికుల భద్రత అంశాలపై కేంద్రం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇటీవల భారతీయులు పనిచేస్తున్న నౌకలపై దాడుల నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్ రాయబారులను విదేశాంగ శాఖ వివరణ కోరింది.
ప్రపంచ సముద్ర రవాణా రంగానికి అత్యధిక సంఖ్యలో నావికులను అందిస్తున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. BIMCO-ICS Seafarer Workforce Report 2026 ప్రకారం, ప్రపంచ షిప్పింగ్ రంగంలో భారత్ నుంచి 3,11,936 మంది సముద్ర నిపుణులు సేవలందిస్తున్నారు. అయితే ఈ సమావేశంలో చర్చించిన అంశాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
ALSO READ: Siricilla | సిరిసిల్లలో తప్పిన పెను ప్రమాదం.. భారీ చెట్టు కూలి వ్యక్తికి గాయాలు








